1400 సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్‌ను చూసిన రమాప్రభ.. ఎందుకలా చేసింది?
on Apr 1, 2024
పాతతరం నటీమణుల్లో రమాప్రభకు ప్రత్యేక స్థానం ఉంది. తన హాస్యనటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రమాప్రభ అసలు పేరు రమాదేవి. పిల్లలు లేని రమాప్రభ మేనత్త నెలరోజుల వయసులోనే ఆమెను దత్తత తీసుకున్నారు. చిన్నతనం నుంచి నటనపై ఎంతో ఆసక్తి కనబరిచేది రమాప్రభ. మాతృభాష తెలుగు అయినప్పటికీ సినిమాల్లోకి రాకముందు తమిళ నాటక రంగంలో నాలుగు వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత తమిళ సినిమాలోనే మొదట నటించింది. తమిళ్‌లో 30 సినిమాలు చేసిన తర్వాతే తెలుగులో నటిగా పరిచయమైంది. తెలుగులో రమాప్రభ నటించిన తొలి చిత్రం ‘చిలకా గోరింకా’. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తం 1400కి పైగా సినిమాల్లో నటించి రికార్డు క్రియేట్ చేసింది. అన్ని వందల సినిమాల్లో నటించిన రమాప్రభ పాఠశాలకు వెళ్ళలేదు, చదువుకోలేదు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ తర్వాత కూడా చదవడం రాయడం ఆమెకు రాదు. డైలాగులు ఒక్కసారి చదివి వినిపిస్తే చాలు, వాటిని గుర్తు పెట్టుకొని సింగిల్ టేక్‌లోనే షాట్ ఓకే చేసేది. అంతటి మెమరి పవర్ రమాప్రభకు ఉంది. హాస్యనటిగానే కాకుండా ఇతర పాత్రలు కూడా చెయ్యాలని ఆమెకు ఉన్నప్పటికీ ఎక్కువగా హాస్య పాత్రలే వచ్చేవి. వచ్చిన అవకాశాల్ని వదులుకోకుండా హాస్యనటిగానే ఎక్కువ సినిమాలు చేశారామె.
ముఖ్యంగా రాజబాబు, రమాప్రభ కాంబినేషన్‌కి అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. వీరిద్దరూ కలిసి 100 సినిమాల్లో నటించారు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇద్దరూ కలిసి మూడు షిఫ్టుల్లో పనిచేసి సినిమాలు పూర్తి చేసేవారు. ఒక సినిమాకి కథ రెడీ అయిపోయిన తర్వాత హీరో, హీరోయిన్‌లను ఎంపిక చేయకముందే రాజబాబు, రమాప్రభ డేట్స్‌ను బ్లాక్ చేసేవారు. ప్రేక్షకులు కూడా సినిమాలో హీరో ఎవరు అనేది పట్టించుకోకుండా రాజబాబు, రమాప్రభ ఉన్నారా అని చూసేవారు. కొన్ని సినిమాల్లో వీరి కాంబినేషన్ సీన్స్‌కి రిపీట్ ఆడియన్స్ వచ్చేవారు. వారి సీన్స్ పూర్తికాగానే థియేటర్ నుంచి బయటికి వెళ్లిపోయేవారు. ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేసిన రాజబాబు, రమాప్రభ ఎంతో స్నేహంగా ఉండేవారు. అలాంటిది హైదరాబాద్‌లో రాజబాబు చనిపోతే.. బెంగళూరులో చలం సినిమా షూటింగ్‌లో ఉన్న రమాప్రభకు తెలియడానికి కొన్ని రోజులు పట్టింది.
తన జీవితంలో జరిగిన పెద్ద నష్టం రాజబాబు మరణం అని చెప్పేవారు రమాప్రభ. తర్వాత మరో పెద్ద నష్టం శరత్‌బాబు నుంచి విడాకులు తీసుకోవడం. తనకంటే ఏడేళ్ళు చిన్నవాడైన శరత్‌బాబును ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు రమాప్రభ. ఎన్నో సినిమాల్లో వాణిశ్రీ స్నేహితురాలిగా నటించిన రమాప్రభ ఒక దశలో స్టార్ట్ స్టేటస్‌ను చూశారు. డబ్బు బాగా సంపాదించారు. క్రమంగా రమాప్రభ ఆస్తులు కరిగిపోవడానికి, శరత్‌బాబు ఆస్తులు పెరిగిపోవడం వెనుక అసలు కారణాలు ఎవ్వరికీ తెలియవు. సినిమా రంగానికి దూరమవ్వాలన్న ఉద్దేశంతో భక్తి మార్గం వైపు వెళుతున్న రమాప్రభకు ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రంలో అవకాశం ఇచ్చి మళ్ళీ చిత్రరంగంవైపు మరలేలా చేశారు దర్శకుడు కృష్ణవంశీ. ఆ తర్వాత నటిగా మళ్ళీ బిజీ అయిపోయారు రమాప్రభ. తొలిసారి అయ్యప్ప మాల వేసుకున్న తెలుగు నటి రమాప్రభ. 1985లో శరత్‌బాబు అయ్యప మాల వేసుకోవడంతో తను కూడా మాల వేసుకుంది.
నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు రమాప్రభ. రాజేంద్రప్రసాద్ హీరోగా ‘గాంధీనగర్ రెండవ వీధి’, ‘అప్పుల అప్పారావు’ చిత్రాలు నిర్మించారు రమాప్రభ. తన అక్క కూతురు విజయఛాముండేశ్వరిని ఇచ్చి పెళ్ళి చేసి రాజేంద్రప్రసాద్‌తో బంధుత్వం కలుపుకున్నారు. ప్రస్తుతం రమాప్రభ తను జన్మించిన చిత్తూరు జిల్లా, మదనపల్లిలోని వాయల్పాడులో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Also Read